కాప్సికమ్ కాయలపళంగా కూర పొడి కూరిన Stuffed Curry.

కాప్సికమ్   కాయలపళంగా కూర పొడి కూరిన Stuffed  Curry.

కావలసినవి.

కాప్సికమ్ చిన్న సైజు కాయలు -  350 గ్రాములు.
ఎండుమిరపకాయలు  --  12
పచ్చిశనగపప్పు  --  మూడు స్పూన్లు 
చాయమినపప్పు  --  రెండు స్పూన్లు 
జీలకర్ర  -- ముప్పావు  స్పూను 
ఆవాలు - కొద్దిగా 
నూనె --  ఎనిమిది  స్పూన్లు 
పెద్ద ఉల్లిపాయలు  --  రెండు.
ఉప్పు  --  తగినంత 

తయారీ విధానము .

ముందుగా  స్టౌ మీద బాండీ పెట్టి రెండు స్పూన్లు  నూనె వేసుకుని  నూనె  బాగా కాగగానే  వరుసగా ఎండుమిరపకాయలు , పచ్చిశనగపప్పు , చాయమినపప్పు , జీలకర్ర మరియు పావు స్పూను  ఆవాలు వేసుకుని  కమ్మని వాసన వచ్చేదాకా  వేయించుకోవాలి .

చల్లారగానే  వేయించిన పోపు మరియు  తగినంత  ఉప్పును  వేసుకుని  మిక్సీ లో వేసుకుని  కొంచెం  పప్పులు  తగిలే విధముగా  మిక్సీ  వేసుకోవాలి.

ఉల్లిపాయలు  చిన్న ముక్కలుగా తరుగుకోవాలి.

ఈ పొడి  వేరే పళ్ళెము లోకి  తీసుకోవాలి .

చిన్న ముక్కలుగా తరిగిన  ఉల్లిపాయలను  ఈ పొడిలో వేసుకుని చేతితో  బాగా నలుపుకోవాలి. 

పొడి అంతా కొంచెం  ముద్దగా అవుతుంది .

కాప్సికమ్  కాయలకు చాకుతో   నాలుగు పక్షాలుగా  మధ్యలో గాటు పెట్టుకోవాలి .

సిద్ధంగా  ఉంచుకున్న  కూరపొడిని  ఈ కాయలలో కూరుకోవాలి .

కొద్దిగా  పొడి  మిగుల్చుకుంటే  చివరలో దింపబోయే ముందు కూరలో కలుపకోవచ్చును. 

స్టౌ మీద మళ్ళీ బాండీ పెట్టుకుని  మిగిలిన  నూనె  మొత్తము వేసి నూనె బాగా కాగగానే  పొడి కూరిన  కాప్సికమ్  కాయలను   నూనెలో  వేసి , స్టౌ ను మీడియం సెగలో పెట్టి   మూతపెట్టి  మధ్య మధ్యలో  అట్లకాడతో    కదుతూ పదిహేను నిముషాల పాటు బాగా కాయలను  బాగా మగ్గనివ్వాలి .

దింపబోయే  అయిదు నిముషాల  ముందు  మిగిలిన పొడి  కూరలో  వేసి  మూత  తీసి కాయలు మరియు పొడి  వేగినట్లుగా  చేసుకుంటే  కూర  చాలా రుచిగా  ఉంటుంది .

 కూరను వేరే డిష్ లోకి  తీసుకోవాలి .

అంతే . ఎంతో  రుచిగా ఉండే  కాప్సికమ్  కూర పొడి  కూరిన కూర భోజనము లోకి సర్వింగ్  కు సిద్ధం.

Comments