నీర్ దోశె తయారీ విధానము .
నీర్ దోశె. .
తయారీ విధానము .
మనం అన్నం వండుకునే మామూలు బియ్యము ఒక కప్పు తీసుకుని అందులో మునిగే వరకు నీళ్ళు పోసి ఐదు గంటలు నాన బెట్టు కోవాలి.
పచ్చి కొబ్బరి అర చిప్ప తీసుకుని కొబ్బరి కోరాముతో తురుముకోవాలి.
తర్వాత నీరు వడకట్టి మిక్సీ లో కాని గ్రైండర్ లో కాని నానబెట్టిన బియ్యము మరియు పచ్చి కొబ్బరి తురుమును వేసుకుని అందులో తగినన్ని నీళ్ళు పోసుకుని దోశెల పిండిలా కాటుకలా మెత్తగా రుబ్బు కోవాలి.
రుబ్బిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో కొద్దిగా ఉప్పును వేసుకుని , అవసరమయితే పిండిలో మరి కొన్ని నీళ్ళు పోసుకుని , గరిటెతో బాగా కలుపుకుని , పిండిని బాగా గరిటె జారుగా ఉండేటట్లుగా చేసుకోవాలి.
తర్వాత స్టౌ మీద పెనం కాని పాన్ కాని పెట్టుకుని , పెనం బాగా కాలనివ్వాలి.
తర్వాత పెనం లేదా పాన్ పైన అర స్పూను నూనె వేసుకుని , ఆ నూనెను అట్లకాడతో పెనం అంతా పరచుకోవాలి.
ఇప్పుడు బాగా కాలిన పెనం మీద గరిటెతో పిండిని మనం రవ్వ దోశెలను ఎలా వేసుకుంటామో ఆ విధముగానే చిల్లులు చిల్లుగా వేసుకోవాలి.
ఆ దోశె పై ఒక స్పూను నూనెను వేసుకుని మూత పెట్టి ఒక వైపే దోశెను కాలనివ్వాలి. రెండో వైపు తిప్పుకోనవసరం లేదు. అప్పుడే నీర్ దోశె మెత్తగా కాలుతుంది .
ఈ నీర్ దోశెలు వేడి వేడిగా తమిళనాడు తన్నీ చట్నీతో తింటే అద్భుతమైన రుచిగా ఉంటాయి. చల్లారితే దోశెలో రుచి తగ్గిపోతుంది.
ఈ నీర్ దోశెలకు కేవలం బియ్యము మరియు పచ్చి కొబ్బరి మాత్రమే వాడతాము కనుక చిన్న పిల్లలకు పెట్టినా జబ్బు చేయదు.
ఆలూరుకృష్ణప్రసాదు .
మరి తన్నీ చట్నీ తయారీ విధానము కూడా తెలుసుకుందామా ?
తన్నీ చట్నీ .
తమిళం లో తన్నీ అంటే మంచి నీళ్ళు అని అర్ధం.
తమిళనాడులో చాలా హోటల్స్ లో ఈ తన్నీ చట్నీ చేస్తారు. ఈ చట్నీ పలుచగా ఉంటుంది .
ఇడ్లీ , దోశె , గారె , పునుగులు ఇలా ఏ టిఫిన్ లోకి అయినా ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది .
తయారీ విధానము.
ఒక 50 గ్రాముల పుట్నాల పప్పు ( వేయించిన శనగపప్పు ) తీసుకోవాలి .
పచ్చి కొబ్బరి ఒక చిప్ప తీసుకుని చిన్న ముక్కలుగా చేసుకోవాలి.
స్టౌ మీద బాండీ పెట్టి రెండు స్పూన్లు నూనె వేసుకుని నూనె బాగా కాగగానే ఎనిమిది ఎండు మిరపకాయలు నూనె లో వేయించుకుని , విడిగా ఓ ప్లేటులోకి తీసుకోవాలి .
తర్వాత అదే బాండీలో ఉన్న మిగిలిన నూనెలో పుట్నాల పప్పును వేసుకుని కమ్మని వాసన వచ్చేదాకా వేయించుకోవాలి.
వేగిన పుట్నాల పప్పును విడిగా ఓ ప్లేటులో తీసుకోవాలి .
ఇప్పుడు మిక్సీలో వేయించిన ఎండు మిరపకాయలు మరియు తగినంత ఉప్పును వేసుకుని మెత్తగా మిక్సీ వేసుకోవాలి.
తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని మెత్తగా మిక్సీ వేసుకోవాలి.
చివరగా వేయించి విడిగా ఉంచిన పుట్నాల పప్పును కూడా వేసుకుని , తగినన్ని నీళ్ళు పోసుకుని పచ్చడిని బాగా మెత్తగా మిక్సీ వేసుకోవాలి .
ఈ పచ్చడిని వేరే గిన్నెలోకి తీసుకోవాలి .
ఇప్పుడు స్టౌ మీద పోపు గరిటె పెట్టి మూడు స్పూన్లు నెయ్యి వేసుకుని , నెయ్యి బాగా కాగగానే రెండు ఎండు మిర్చి , స్పూను మినపప్పు , ముప్పావు స్పూను ఆవాలు , కొద్దిగా ఇంగువ మరియు రెండు రెమ్మలు కరివేపాకును వేసుకుని పోపు వేసుకుని , వేయించిన ఈ పోపును పచ్చడిలో వేసుకుని స్పూనుతో బాగా కలుపుకోవాలి.
పచ్చడి పల్చగా ఉండాలనుకుంటే పచ్చడిలో మరి కాసిని నీళ్ళు పోసుకోవాలి.
Comments
Post a Comment