పునాస కాపు మామిడి కాయతో పచ్చడి
పునాస కాపు మామిడి కాయతో పచ్చడి.
తయారీ విధానము .
ముందుగా గట్టిగా ఉన్న పుల్లని మామిడికాయను తీసుకుని కాయ పై తొక్కు తీసుకుని , మాగాయకు ముక్కలు తరిగినట్లు నిలువుగా ముక్కలుగా తరుగుకోవాలి. ఈ ముక్కలు విడిగా ఒక పళ్ళెములో తీసుకుని , ముక్కలపై పావు స్పూను పసుపు వేసుకోవాలి.
తర్వాత స్టౌ మీద బాండీ పెట్టుకుని నాలుగు స్పూన్లు నూనె వేసుకుని , నూనె బాగాకాగగానే ముందుగా ముప్పావు స్పూను మెంతులు వేసుకుని , మెంతులను బాగా వేగనివ్వాలి. తర్వాత అందులోనే 12 ఎండుమిరపకాయలు , స్పూను ఆవాలు మరియు పావు స్పూనులో సగం ఇంగువను వేసుకుని , పోపు వేయించుకోవాలి.
పోపు చల్లారగానే మిక్సీలో వేయించిన పోపు మొత్తము మరియు తగినంత ఉప్పును వేసుకుని , మెత్తగా మిక్సీ వేసుకోవాలి.
తర్వాత అందులో తరిగి సిద్ధంగా ఉంచుకున్న మామిడి కాయ ముక్కలను కూడా వేసుకుని , పచ్చడిని మెత్తగా మిక్సీ వేసుకోవాలి.
తర్వాత విడిగా ఓ గిన్నెలోకి తీసుకోవాలి .
ఈ పచ్చడిలో మేము బెల్లం వేయలేదు. మీరు కావాలంటే కొద్దిగా బెల్లం వేసుకొనవచ్చును .
మేము పచ్చడి మిక్సీ వేసేటప్పుడు నీళ్ళు పోయలేదు. అందువలన పచ్చడి ఓ వారం రోజులు నిల్వ ఉంటుంది.
అంతే. భోజనము లోకి , ఇడ్లీ , దోశెలు , గారెలు మరియు చపాతీల లోకి ఎంతో రుచిగా ఉండే మామిడికాయ పచ్చడి సర్వింగ్ కు సిద్ధం.
Comments
Post a Comment