కంద బచ్చలి కూర తయారి విధానం

 .

కంద బచ్చలి కూర.

వివాహాలలో కంద బచ్చలికూర  తప్పనిసరిగా  చేయడంలోని ఆంతర్యం ఏమిటి ?

దాని  అంతరార్ధము  "  కంద  బచ్చలి  కలిపి కూర వండినప్పుడు  , ఎలా  చక్కగా   కలిసి పోయాయో , అలా   ఆలుమగలైన  మీ  నూతన దంపతులిరువురూ 
కలిసి మెలసి  అన్యోన్యంగా  జీవించాలని  "  అనే  ఉద్దేశ్యంతో  శుభ సూచికంగా  తప్పనిసరిగా  ఈ కూరను  ఒక ఐటమ్ గా  వివాహాలలో  వండుతారు.

కంద  బచ్చలికూర   తయారీ  విధానము .

కావలసినవి:-

కంద - పావు కిలో

బచ్చలి కూర    - రెండు కట్టలు

పచ్చిమిర్చి  - ఎనిమిది.

కరివేపాకు - మూడు రెబ్బలు

కారం     - స్పూను

ఉప్పు     - తగినంత

నూనె    -  నాలుగు స్పూన్లు

చింతపండు రసం  - నాలుగు  స్పూన్లు 

పోపునకు.

ఎండుమిరపకాయలు  - 4. చిన్న ముక్కలుగా  చేసుకోవాలి .

పచ్చిశనగపప్పు -  రెండు  స్పూన్లు 

చాయ మినపప్పు  -  స్పూను.

జీలకర్ర  -  పావు  స్పూను.

ఆవాలు  -  అర  స్పూను

ఇంగువ  -  తగినంత . 

తయారు చేయు విధానము : ----

కంద పై  చెక్కు తీసి,నీళ్ళలో ఒకటికి రెండుసార్లు బాగా కడగాలి.

బచ్చలి కూర కూడా కడిగి సన్నగా తరగాలి. రెండూ కలిపి  కంద మరియు బచ్చలి  మునిగే వరకు  నీళ్ళు పోసి ఉడికించాలి.  చల్లారిన  తర్వాత వడకట్టుకుని వేరే ప్లేటులో విడిగా పక్కన పెట్టుకోవాలి.

ఆవ పెట్టడానికి.

ఒక  ఎండుమిరపకాయ , రెండు పచ్చిమిర్చి , పావు స్పూను ఆవాలు , కొంచెం  ఉప్పు మరియు  కొద్దిగా  పసుపును మిక్సీ లో వేసుకుని ,చాలా కొద్దిగా  నీరు పోసి  మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆవను  తీసి విడిగా  ఒక గిన్నెలో  పెట్టుకోవాలి.

తర్వాత మిగిలిన  పచ్చి మిర్చి  ముక్కలుగా  తరుగు కోవాలి.

తర్వాత స్టౌ మీద బాండీ పెట్టి మొత్తము  నూనె పోసి  నూనె బాగా కాగగానే  పైన చెప్పిన పోపు సామాను ఒకటొకటిగా వేసి, పోపు వేగగానే అందులో పచ్చిమిర్చి  ముక్కలు మరియు కరివేపాకును వేసి  వేయించుకోవాలి. అందులోనే  సిద్ధంగా  ఉంచుకున్న చింతపండు  రసము, తగినంత ఉప్పు , కారము , పావు స్పూను  పసుపు   మరియు  కొద్దిగా  ఇంగువను  వేసి  బాగా  గరిటెతో కలపాలి.

తర్వాత ఉడికి  సిద్ధంగా  ఉంచుకున్న కందబచ్చలి ఒకసారి మెదిపి పోపులో వేయాలి. మూత పెట్టి  ఐదు నిముషాలు మగ్గనిచ్చి  స్టౌ  ఆపేయాలి.

ఇప్పుడు  ముందు మిక్సీ  వేసుకుని  సిద్ధంగా ఉంచుకున్న ఆవను కూర మీద  వేసి అర స్పూను పచ్చి నూనె ఆవ మీద వేసి గరిటెతో  బాగా కలిపి మూతపెట్టి ఉంచాలి.

అంతే . ఆవ ఘుమ,ఘుమలతో ఎంతో  రుచిగా  ఉండే  ప్రాచీన  వంటకం  కంద బచ్చలి కూర సర్వింగ్ కు  సిద్ధం .

ఈ కూర వేడి వేడి అన్నంలో నెయ్యీ  వేసుకుని  తింటే బాగుంటుంది, మర్నాటికి కూడా  రుచి మరింత బాగుంటుంది.

Comments