నువ్వుల పొడితో చింతపండు పులిహోర.
నువ్వుల పొడితో చింతపండు పులిహోర.
కావలసినవి .
చింతపండు -- 75 గ్రాములు గింజలను తీసుకుని గ్లాసున్నర వేడినీటిలో పదిహేను నిముషములు నానబెట్టుకోవాలి .
తదుపరి వేరే గిన్నెలో చిక్కగా రసం తీసుకోవాలి .
నువ్వు పప్పు -- 50 గ్రాములు.
నూనె వేయకుండా నాలుగు ఎండుమిరపకాయలు వేసి బాండిలో వేయించుకుని ఆ తర్వాత మిక్సీ లో మెత్తని పొడిగా వేసుకోవాలి .
ఈ పొడి విడిగా ఓ ప్లేటులో తీసుకుని ఉంచుకోవాలి .
పచ్చిమిర్చి -- పది . తొడిమలు తీసుకుని ఉంచుకోవాలి .
కరివేపాకు -- ఎనిమిది రెమ్మలు .
బియ్యము -- ఒకటిన్నర గ్లాసు
పోపుకు .
ఎండుమిరపకాయలు -- పది
పచ్చి శనగపప్పు -- మూడు స్పూన్లు
మినపప్పు -- రెండు స్పూన్లు
ఆవాలు -- స్పూను
పల్లీలు --- నాలుగు స్పూన్లు
ఇంగువ -- పావు స్పూను .
నూనె --- 75 గ్రాములు.
ముందుగా గిన్నెలో గ్లాసున్నర బియ్యము సరిపడా నీళ్ళు పోసి స్టౌ మీద పెట్టుకొని మరీ మెత్తగా కాకుండా పొడిగా వండుకోవాలి .
అన్నం ఉడికే లోపున -
స్టౌ మీద బాండి పెట్టి ఓ 50 గ్రాముల నూనె వేసి , నూనె బాగా కాగగానే వరుసగా ఎండుమిరపకాయలు , పచ్చి శనగపప్పు , మినపప్పు , ఆవాలు , ఇంగువ, పచ్చిమిరపకాయలు , కరివేపాకు మరియు వేరుశనగ గుళ్ళు వేసి పోపు బాగా వేయించుకోవాలి.
పోపు వేగుతున్నప్పుడే ఆ పోపులోనే చింతపండు రసము , తగినంత ఉప్పు మరియు కొద్దిగా పసుపు వేసి బాగా ఉడకనివ్వాలి .
తర్వాత బేసిన్ లో ఉడికిన అన్నం , స్పూను పసుపు , కరివేపాకు , మిగిలిన నూనె , కొద్దిగా ఉప్పు మరియు ముందుగా సిద్ధం చేసుకున్న పోపు లో ఉడికిన చింతపండు రసము అన్నములో వేసి గరిటతో అన్నం అంతా పొడి పొడిగా కలుపు కోవాలి .
చివరగా ముందుగా సిద్ధంగా ఉంచుకున్న నువ్వుపప్పు పొడి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి .
అంతే . చింతపండుతో నువ్వుల పొడి , ఇంగువ సువాసనలతో నోరూరించే పులిహోర మీకు సర్వింగ్ కు సిద్ధం .
Comments
Post a Comment