పెసర ఆవకాయ.ఆవకాయ.
పెసర ఆవకాయ.
ఆవకాయ.
ఉల్లి ఆవకాయ.
శనగ ఆవకాయ.
పెసరావకాయ.
బెల్లపావకాయ.
దప్పళపు ఆవకాయ.
కాయావకాయ.
పచ్చావకాయ.
నువ్వావకాయ.
మెంతికాయ.
పులిహోర ఆవకాయ.
మాగాయ.
తొక్కుడు పచ్చడి.
తురుము పచ్చడి.
ఇలా రక రకాలైన ఆవకాయలను అన్ని జిల్లాల వారు పెడతారు .
ముఖ్యంగా ఏటికి ఏడాది నిల్వ ఉండే అవకాయ , ఉల్లి ఆవకాయ వంటివి ఎక్కువ మోతాదులో , మిగిలినవి తక్కువ మోతాదులో పెట్టుకుంటారు.
ఇలా తక్కువ మోతాదులో పెట్టుకునేది ఈ పెసరావకాయ.
ఈ పెసరావకాయ బాగా తాజాగా ఓ మూడు నెలలు ఉంటుంది . తర్వాత దీని రుచి క్రమంగా తగ్గిపోతుంది .
అయితే కొత్తలో పెసరావకాయ రుచి మహాద్భుతంగా ఉంటుంది . నేను ఈ పెసరావకాయ కొలతలు షుమారుగా మూడు మామిడి కాయలకు చెబుతాను.
మీరు ఎక్కువ మోతాదులో పెట్టుకోదల్చిన పక్షంలో కాయలను బట్టి మిగిలిన దినుసులు పెంచుకోండి.
పెసరావకాయ.
తయారీ విధానము.
కావలసినవి.
గుండ్రని పుల్లని మామిడి కాయలు - 3
చాయ పెసర పప్పు - 250 గ్రాములు.
ఎండుమిరపకాయల కారం - 200 గ్రాములు .
ఆవ పిండి - 150 గ్రాములు .
మెత్తని ఉప్పు - 125 గ్రాములు.
ఎండుమిరపకాయలు -8
ఆవాలు - స్పూనున్నర .
ఇంగువ - స్పూను .
నూనె - 350 గ్రాములు.
( నువ్వుపప్పు నూనె వాడితే ఊరగాయ రుచిగా ఉంటుంది .)
తయారీ విధానము .
ముందుగా చాయ పెసర పప్పు రాళ్ళు లేకుండా శుభ్రం చేసుకుని , ఒక పళ్ళెంలో పోసుకుని ఒక రోజంతా ఎర్రని ఎండలో ఎండ బెట్టాలి.
ఎండలో నుండి తీసుకుని వచ్చి వేడిగా ఉండగానే మిక్సీ లో వేసి మెత్తని పొడిగా మిక్సీ వేసుకోవాలి .
తర్వాత ఈ పొడిని పిండి జల్లెడతో జల్లించుకోవాలి. బరకగా ఉన్న పప్పుల్ని మరొకసారి మిక్సీ వేసుకుని మళ్ళీ జల్లించి మెత్తని పొడి సిద్ధం చేసుకోవాలి .
ఇప్పుడు మామిడి కాయలు శుభ్రంగా కడిగి పొడి గుడ్డతో తుడుచుకుని లోపలి టెంకతో సహా ముక్కలుగా తరుగుకోవాలి.
తర్వాత ఒక పెద్ద బేసిన్ తీసుకుని ఎండు కారం , ఆవ పిండి మరియు ఉప్పు నేను చెప్పిన మోతాదులో వేసుకుని చేతితో మూడు బాగా కలుపుకోవాలి. అందులోనే తరిగి సిద్ధంగా ఉంచుకున్న మామిడి కాయ ముక్కలు వేసుకుని ముక్కలకు పిండి బాగా పట్టే విధముగా చేతితో బాగా కలుపుకుని ఒక ప్రక్కన పెట్టుకోవాలి .
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి నూనె అంతా పోసి నూనెను బాగా కాగనివ్వాలి.
నూనె బాగా కాగగానే ఎండుమిరపకాయలు , ఆవాలు వేసి, ఆవాలు చిటపట లాడగానే కిందకు దింపి , ఆ వేడి నూనెలో ఇంగువ మరియు సిద్ధంగా ఉంచుకున్న పెసర పిండిని వేసి గరిటెతో బాగా కలుపుకోవాలి.
ఇలా కలిపిన మిశ్రమమును చల్లార నివ్వాలి .
చల్లారగానే ఈ మిశ్రమమును సిద్ధంగా కలిపి ఉంచుకున్న మామిడి కాయ ముక్కలలో పోసుకుని బాగా కలుపు కోవాలి.
పూర్తిగా వేడి తగ్గగానే జాడీలోకి తీసుకుని పెట్టుకోవాలి.
ఒక రోజు ఊర నిచ్చి మరుసటి రోజు గరిటెతో బాగా తిరగ కలిపి వాడుకొనవచ్చును .
అంతే ఇంగువ మరియు పెసర పిండి వాసనతో ఎంతో రుచిగా ఉండే పెసరావకాయ భోజనము లోకి , ఇడ్లీ , గారెలు , దోశెలు , రోటీలు మరియు చపాతీల లోకి సర్వింగ్ కు సిద్ధం.
Comments
Post a Comment