చారు / రసము ఒట్టి వేడి నీళ్ళే కదా
చారు / రసము ఒట్టి వేడి నీళ్ళే కదా !
అందులో పోషక విలువలేమున్నాయి ? అని కొంత మంది అభిప్రాయం.
కాని పాత తరం పెద్ద వాళ్ళు తమ పసి పిల్లల నెలల వయసు లోనే అన్నం బాగా పేస్ట్ లా వండి అందులో నెయ్యి బాగా వేసి చారు వేసి బాగా గుజ్జులా చేసి చిన్న చిన్న గోరు ముద్దలు పెట్టేవారు .
పసిపిల్లలకు చాలా తేలికగా జీర్ణమయ్యేది .
అలా క్రమ క్రమంగా అందులోనే మెత్తని పప్పు కలిపి తినిపించేవారు .
ఈ కాలంలో లా చంటి పిల్లలకు Cerlac లు అవి ఆ కాలంలో లేవు కదా !
పెద్దలందరు కూడా రోజు భోజనము లో చారు చేర్చుకోవడం జీర్ణ వ్యవస్ధకు చాలా మంచిది .
ఇక చారు తయారీ విధానము .
ముందుగా చారు పొడి / రసము పొడి తయారు చేసుకునే విధానము .
మా ఇంట్లో చారు పొడి నెలకు సరి పడా మిక్సీ వేసుకుంటాము .
చారుపొడి చేసుకునే విధానము .
ఎండు మిరపకాయలు --- షుమారు 20 గ్రాములు.
ధనియాలు ---- 50 గ్రాములు
జీలకర్ర ----- 25 గ్రాములు
మిరియాలు ---- 20 గ్రాములు
పచ్చి శనగపప్పు --- 15 గ్రాములు
కందిపప్పు ---- 25 గ్రాములు
పచ్చి శనగపప్పు మరియు కందిపప్పు వేయడం వలన చారు చిక్కదనం వచ్చి రుచిగా ఉంటుంది
షుమారుగా కొలతలు చెప్పాను.
ఇవి అన్నీ పచ్చివే ఒక చాటలో పోసి ఎర్రటి ఎండలో మూడు రోజులు ఎండ నివ్వండి .
మూడో రోజు ఈ పదార్ధాలన్నీ మెత్తగా మిక్సీ వేసుకోండి .
మేము ఇందులో కొంచెం పచ్చి ఇంగువ వేసుకుంటాం .
మీకు ఇష్ట మైతే మిశ్రమములో మిక్సీ వేయబోయే ముందు ఇంగువ తగినంత వేసుకోండి.
మిరియాలు మరి కాస్త వేసుకుంటే మంచి ఘాటుతో చారుపొడి రెడీ అవుతుంది .
ఈ మిశ్రమాన్ని ఒక సీసాలో పోసి నిల్వ ఉంచుకోండి .
టమోటో చారు / టమోటో రసము తయారీ విధానము .
ముందుగా బాగా పండి గట్టిగా ఉన్న రెండు టమోటో లను ముక్కలుగా తరుగుకోండి.
ఒక గిన్నెలో తరిగిన టమోటో ముక్కలు , నిమ్మకాయంత చింతపండు , తరిగిన మూడు పచ్చిమిరపకాయల ముక్కలు ,తగినంత ఉప్పు , రెండు రెమ్మలు కరివేపాకు ,కొద్దిగా పసుపు వేసి రెండున్నర గ్లాసులు నీళ్ళు పోసి బాగా తెర్లుతున్నప్పుడు ఈ చారుపొడి రెండు స్పూన్లు వేసి పొంగకుండా చూసుకుని, దింపే ముందు కొత్తిమీర వేసుకుని తర్వాత రెండు ఎండుమిరపకాయలు , ఆవాలు , జీలకర్ర , మెంతులు , ఇంగువ వేసి నూనెతో పోపు పెట్టుకోండి .
Comments
Post a Comment