నిమ్మ కాయ కారము


నిమ్మ కాయ కారము.

 (  ప్రాచీన  వంటకం. )

తయారీ  విధానము.

ముందుగా మూడు  పసుపు  పచ్చని నిమ్మకాయలు  తీసుకుని , కాయలను మధ్యకు తరిగి , ఒక  చిన్న గిన్నెలో  రసము తీసుకోవాలి .  కాయల లోని  చిరు చేదు రసము లోకి దిగకుండా  రసమును గిన్నెలోకి  తీసుకోవాలి . రసమును  విడిగా  ఉంచుకోవాలి.

స్టౌ  మీద బాండీ  పెట్టుకుని  ఐదు  స్పూన్లు  నూనె  వేసుకుని , నూనె  బాగాకాగగానే  ముందు అర స్పూను  మెంతులు వేసుకుని , మెంతులను బాగా  వేగనివ్వాలి. మెంతులు బాగా వేగకపోతే  పచ్చడి  చేదు వస్తుంది . 

తర్వాత  అందులోనే  మూడు స్పూన్లు  పొట్టు మినపప్పు , స్పూను  ఆవాలు , పదిహేను ఎండుమిరపకాయలు మరియు పావు స్పూనులో సగం ఇంగువను  వేసుకుని , పోపును  కమ్మని  వేగిన వాసన వచ్చే వరకు వేయించుకోవాలి.

పోపు  చల్లారగానే  మొత్తం  పోపును  మిక్సీ లో వేసుకుని , అందులో అర స్పూను  పసుపు మరియు  తగినంత  ఉప్పును  వేసుకుని , కొంచెం  పప్పులు  తగిలే  విధముగా  మిక్సీ  వేసుకోవాలి.

తర్వాత  ఈ పొడిని  సిద్ధంగా  ఉంచుకున్న  నిమ్మరసములో వేసుకుని  స్పూనుతో బాగా కలుపు కోవాలి.

ఇందులో  ధనియాలు  మరియు  జీలకర్ర  వేయరు.

రోటిలో చేసుకునే  సౌకర్యము  ఉన్నవారు , ఈ నిమ్మకాయ కారము  రోటిలో పచ్చడి బండతో దంపుకుని  చేసుకుంటే , ఆ రుచి  చెప్పనలవి కాదు.

ఇడ్లీ , దోశెలు , గారెలు మరియు భోజనము లోకి  ఎంతో రుచిగా ఉండే  ప్రాచిన వంటకము నిమ్మకాయ కారము సర్వింగ్  కు సిద్ధం.

ఈ కారము  వారం రోజులు పైనే  నిల్వ ఉంటుంది .

Comments