ఈ రోజు స్పెషల్ ఐటం ' ముక్కల పులుసు
ఈ రోజు స్పెషల్ ఐటం ' ముక్కల పులుసు '.
రసం , సాంబారు , పప్పు పులుసు , పప్పు చారు ఇలా లిక్విడ్ ఐటమ్స్ లో వివిధ రకాలున్నా ముక్కల పులుసు ది ప్రత్యేక స్ధానం. ప్రధమ స్ధానం.
వెనుకటి కాలం లో ప్రతి శుభ కార్యాల లోనూ ఈ ముక్కల పులుసును తప్పనిసరిగా చేసేవారు.
తెలుగు వారి భోజనాలలో నెయ్యి వేసి వేయించి కందిపప్పు తో వండిన ముద్ద పప్పు , పనస పొట్టు కూర , కొత్తావకాయ , ముక్కల పులుసు ,
కమ్మని నెయ్యి, మీగడ పెరుగు, కొనసీమ కొత్తపల్లి కొబ్బరి మామిడి పండు గొప్ప కాంబినేషన్ .
వేయి రూపాయల విందు భోజనమైనా ఈ మెనూ ముందు దిగదుడుపే .
మరి ఈ ముక్కల పులుసు తయారీ విధానము గురించి తెలుసుకుందాం.
కావలసినవి.
ఆనపకాయ / సొరకాయ --
కాయలో పావు ముక్క .
మంచి గుమ్మడికాయ ముక్క -
షుమారు పావు కిలో ముక్క.
ములక్కాడలు --- 2
వంకాయలు --- 2
టమోటోలు -- 2
బెండకాయలు - 8
చిలకడదుంపలు - 4
పచ్చి మిర్చి - 5
కరివేపాకు -- మూడు రెమ్మలు
కొత్తిమీర -- ఒక కట్ట
చింతపండు -- 50 గ్రా
బెల్లం -- 30 గ్రా ( తీపి ఇష్టం లేని వారు బెల్లం వేయకుండా చేసుకొనవచ్చును . )
పసుపు -- పావు స్పూను
కారం --- అర స్పూను
ఉప్పు --- తగినంత
పోపుకు
ఎండుమిర్చి -- మూడు
మెంతులు -- కొద్దిగా
ఆవాలు -- అర స్పూను
జీలకర్ర --- పావు స్పూను
ఇంగువ -- కొద్దిగా
తయారీ విధానము.
ముందుగా పదిహేను నిముషములు చింతపండు నీళ్ళలో నాన బెట్టుకుని ఒక రెండు గ్లాసుల రసం తీసుకొని ఒక గిన్నెలో పోసుకోవాలి.
ఆనపకాయ చెక్కు తీసుకుని ముక్కలుగా తరుగు కోవాలి .
మంచి గుమ్మడికాయ పై చెక్కు తీయనవసరము లేదు. ముక్కలుగా తరుగుకోవాలి.
చిలకడ దుంపలు చెక్కు తీయనవసరంలేదు. గుండ్రంగా ముక్కలు తరుగు కోవాలి.
ములక్కాడలు , టమోటాలు , బెండ కాయలు , వంకాయలు అన్నీ ముక్కలు తరుగు కోవాలి .
పచ్చి మిర్చి నిలువుగా చీల్చు కోవాలి .
ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో ఈ తరిగిన అన్ని ముక్కలు వేసుకోవాలి .
ఇందులో చింతపండు రసం నీళ్ళు పోయాలి . మరో గ్లాసున్నర నీళ్ళు పోసుకోవాలి.
ఇందులో పసుపు , తగినంత ఉప్పు , బెల్లం , కారం , తరిగిన పచ్చిమిర్చి ముక్కలు , కరివేపాకు వేయాలి .
ఇప్పుడు స్టౌ వెలిగించి మీడియం సెగన ఈ పులుసును ఓ ఇరవై నిముషాల పాటు ముక్కలన్నీ మెత్తగా ఉడికేలా మరగ నివ్వాలి .
ఆ తర్వాత మూడు విధములుగా మన అభిరుచిని బట్టి చేసుకోవచ్చు.
మొదటిది విధానము.
ముక్కలు ఉడికాక రెండు గరిటెలు మెత్తగా ఉడికిన పప్పు బాగా యెనిపి పులుసులో వేసి మరో అయిదు నిముషాలు మరగ నిచ్చి దింపు కోవచ్చు.
రెండవ విధానము .
ఒక రెండు స్పూన్లు బియ్యపు పిండి తీసుకొని అరగ్లాసు నీళ్ళలో వేసి ఉండలు లేకుండా కలిపి , మరుగుతున్న పులుసులో వేసి మరో అయిదు నిముషములు కాగనిచ్చి దింపుకోవచ్చు.
ఇక మూడవ విధానము.
పావు స్పూను మెంతులు , మూడు ఎండుమిరపకాయలు , స్పూను పచ్చిశనగపప్పు , అర స్పూను మినపప్పు , స్పూను ధనియాలు,
కొంచెం ఇంగువ మూడు స్పూన్లు నూనెలో వేయించి అందులో పావు చిప్ప ఎండు కొబ్బరి ముక్కలుగా తరిగి వేసి వేయించుకోవాలి .
చల్లారగానే ఈ మిశ్రమము అంతా మిక్సీ లో వేసుకొని మెత్తని పొడిగా వేసుకోవాలి .
ఈ పొడిని మరుగుతున్న పులుసులో ముక్కలన్నీ ఉడికాక వేసి , మరో అయిదు నిముషముల పాటు తెర్ల నివ్వాలి.
చివరగా పోపు గరిట స్టౌ మీద పెట్టి రెండు స్పూన్లు నూనె వేసి ఎండు మిర్చి ముక్కలు, జీలకర్ర , ఆవాలు , మెంతులు , ఇంగువ వేసి పోపు పెట్టు కోవాలి .
పైన కొత్తిమీర తరిగి వేసుకోవాలి .
అంతే అద్భుతమైన రుచితో మరియు ఇంగువ వాసనలతో ఘుమ ఘుమ లాడే " ముక్కల పులుసు " సర్వింగ్ కు సిద్ధం.
చక్కగా రెండు రోజుల పాటు భోజనము లోకి , ఇడ్లీల లోకి , పూరి , చపాతీ ల లోకి వేసుకుని తినవచ్చు.
Comments
Post a Comment