కరివేపాకు రోటి పచ్చడి .తయారీ విధానము


కరివేపాకు రోటి పచ్చడి .
తయారీ  విధానము  .

ముందుగా  స్టౌ మీద బాండీ పెట్టుకుని నాలుగు స్పూన్లు  నూనె  వేసుకుని నూనె బాగాకాగగానే  , రెండు కప్పుల కరివేపాకు  , 50  గ్రాముల  పొట్టు  మినపప్పు  ,  పన్నెండు  ఎండుమిరపకాయలు  , అర స్పూను   ఆవాలు ,  ఇంగువ  కొద్దిగా వేసుకుని పోపు వేయించుకోవాలి.  

నిమ్మకాయంత  చింతపండు   వేడి నీళ్ళలో  పావు గంట సేపు   నాన బెట్టు కొని    చిక్కగా  రసం  తీసుకోవాలి .
 
పోపు చల్లారగానే  రోటి లో  ముందు  వేయించిన   ఎండుమిరపకాయలు ,  తగినంత ఉప్పు మరియు కొద్దిగా  పసుపును వేసుకుని   పచ్చడి బండతో దంపుకోవాలి .  

ఆ  తర్వాత  వేయించి  సిద్ధంగా  ఉంచుకున్న పొట్టు మినపప్పు   కరివేపాకు   మిశ్రమం , చింతపండు  రసం మరియు తీపి  ఇష్టమైన వారు  కొద్దిగా  బెల్లం  వేసుకుని  కొంచెం కొంచెం   నీరు    చల్లుకుంటూ  పప్పులు పప్పులుగా    పొత్రముతో రుబ్బు కోవాలి.  ఈ విధముగా  రుబ్బితే  కరివేపాకు   పచ్చడి  రుచిగా బాగుంటుంది .

పొట్టు  మినపప్పు తో  అయితే  పచ్చడి చాలా రుచిగా  ఉంటుంది  . 

పొట్టు మినపప్పు  లేని పక్షంలో చాయమినపప్పు  వేసుకుని  పచ్చడి  చేసుకొనవచ్చును .

ఈ పచ్చడి  ఐదు రోజులు  నిల్వ ఉంటుంది.

రోటి  సౌకర్యం  లేని  వారు  పైన  నేను  తెలియచేసిన  పద్ధతిలోనే  పచ్చడి  మిక్సీ లో  చేసుకొనవచ్చును.

Comments