మామిడి కాయ తురుము పచ్చడి
మామిడి కాయ తురుము పచ్చడి.
మామిడి కాయ తురుము పచ్చడి కూడా ఆవకాయ మాగాయల మాదిరిగానే ఏడాది నిల్వ పచ్చడిగా పెట్టుకుంటారు.
నా అభిప్రాయం ప్రకారం ఈ తురుము పచ్చడి మూడు నెలలు తాజాగా ఉంటుంది.
ఫ్రిజ్ లో పెట్టుకుంటే మరో రెండునెలలు నిల్వ ఉంటుంది .
మేము కేవలం రెండు పెద్ద కాయలు ( జలాలు ) తురుము పచ్చడి గా పెట్టుకున్నాము.
అందువలన నేను తురుము పచ్చడి కొలతలు రెండు కాయలకు చెబుతున్నాను,
మీరు ఎక్కువ కాయలు తురుము పచ్చడి పెట్ట దల్చుకున్న పక్షంలో దాని ప్రకారము కొలతలు పెంచుకోండి.
మామిడి కాయ తురుము పచ్చడి.
*****************************
తయారు చేసే విధానము.
రెండు మామిడి కాయలు శుభ్రంగా కడిగి పొడి గుడ్డతో తుడుచుకుని , కాయలపై పై చెక్కు తీసి ఎండు కొబ్బరి కోరాముతో తురుము కోవాలి.
ఒక బేసిన్ లో తురిమిన మామిడి తురుము తీసుకోవాలి .
అందులో ఒక ముప్పావు స్పూను పసుపు మరియు షుమారుగా 40 గ్రాముల మెత్తని ఉప్పు వేసి చేతితో తురుమును బాగా కలుపు కోవాలి .
అలా కలిపిన తురుమును ఒక పళ్ళెములో వేసుకుని షుమారుగా మూడు గంటల సేపు తురుమును ఎర్రని ఎండలో ఎండ బెట్టాలి.
మామిడి తురుము పొడిగా ఎండిన తర్వాత --
ముందుగా స్టౌ మీద బాండీ పెట్టీ షుమారుగా 25 గ్రాములు మెంతులు వేసి నూనె వేయకుండా కమ్మని వాసన వచ్చే దాకా వేయించుకుని విడిగా ఒక ప్లేటులో తీసుకోవాలి.
ఆ తర్వాత తిరిగి స్టౌ మీద బాండీ పెట్టి ఒక 25 గ్రాములు ఆవాలు వేసి నూనె లేకుండా వేయించుకుని విడిగా ప్లేటులో తీసుకోవాలి.
చల్లారిన తర్వాత మెంతులు , ఆవాలు రెండింటినీ విడివిడిగా మిక్సీ వేసుకుని వేరు వేరుగా తీసుకోవాలి .
ఇప్పుడు ఒక బేసిన్ తీసుకుని, ఎండ బెట్టిన మామిడి కాయ తురుమును వేసుకుని , అందులో ఒక 75 గ్రాములు కారము వేసుకుని చేతితో బాగా కలుపుకోవాలి.
అందులోనే వేయించి , మెత్తగా పొడి చేసి సిద్ధంగా ఉంచిన ఆవ పిండి మరియు మెంతి పిండి వేసి బాగా కలుపు కోవాలి.
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి ఒక 150
గ్రాముల నూనె వేసి , నూనె బాగా కాగగానే , అందులో నాలుగు ఎండుమిరపకాయలు , అర స్పూను ఆవాలు వేసుకుని ఆవాలు చిటపట లాడగానే అందులో ముప్పావు స్పూను ఇంగువ వేసి, నూనె చల్లారగానే , ఆ నూనెను మెంతిపిండి , ఆవపిండి మరియు కారము వేసి కలిపిన మామిడి కాయ తురుములో వేసుకుని గరిటెతో బాగా కలుపుకోవాలి .
అంతే ఎంతో రుచిగా ఉండే మామిడి కాయ తురుము నిల్వ పచ్చడి భోజనము లోకి మరియు అల్పాహారముల లోకి సిద్ధం.
Comments
Post a Comment