కొత్తిమీర కారం రోటి పచ్చడి



కొత్తిమీర  కారం. రోటి పచ్చడి.

కావలసినవి.

ఎండుమిరపకాయలు   బాగా  గల గల లాడుతూ  ఎండినవి -- 12
పచ్చి మిరపకాయలు  -- 10
చింతపండు   --  40  గ్రా
ధనియాలు  --  నాలుగు  స్పూన్లు 
ఉప్పు  --  తగినంత 
బెల్లం  --  20  గ్రా
పసుపు  --   పావు  స్పూను
కొత్తిమీర  --  మూడు చిన్న కట్టలు మరి  కాస్త  ఎక్కువగా .
ఎంత  ఎక్కువ   వేసుకుంటే  అంత రుచి .

పోపుకు .

ఎండుమిరపకాయలు  - 2
పొట్టు మినపప్పు   --  స్పూను
ఆవాలు  ---  అర  స్పూను
ఇంగువ  ---  కొద్దిగా 
నూనె  ---  మూడు స్పూన్లు 

తయారీ  విధానము .

ముందుగా  చింతపండు   విడదీసి  నీళ్ళలో  తడిపి  ఉంచుకోవాలి.

కొత్తిమీర   ఎక్కువ   మోతాదులో  తీసుకొని   క్రింద కాడలు  తీసి  కడిగి  శుభ్రం  చేసుకోవాలి .

అన్నీ కూడా  వేయించ  కుండా  అలాగే  వేసుకోవాలి.

ముందుగా  ఎండుమిరపకాయలు , ధనియాలు , ఉప్పు  వేసి  రోటిలో  పచ్చడి బండతో  మెత్తగా  దంపుకోవాలి.

తరువాత తడిపిన  చింతపండు ,పచ్చిమిరపకాయలు   ( తొడిమలు తీసి కడిగి  అలాగే  వేసుకోవాలి  ) బెల్లం , పసుపు  వేసి
బాగా మెత్తగా   దంపుకోవాలి .

తర్వాత  మొత్తం   కొత్తిమీర   అంతా  రోటిలో  వేసి  మెత్తగా   పచ్చడి  బండతో  నూరాలి .

కొత్తిమీర , పచ్చి మిరపకాయలు  లో  తడి  ఉంటుంది   కనుక  నీళ్ళు పోయక్కరలేదు  చేసేటప్పుడు .

మరీ  గట్టిగా   అన్పిస్తే  నీళ్ళు  చేత్తో చిలకరిస్తే సరిపోతుంది .

రోటి లో నుండి  గిన్నెలోకి  తీసుకోవాలి .

ఇప్పుడు  స్టౌ  మీద  బాండి  పెట్టి  నూనె  వేసి  నూనె  కాగగానే  ఎండు మిర్చి , మినపప్పు , ఆవాలు , ఇంగువ  తో  పోపు  పెట్టుకొని  స్పూను  తో  బాగా  కలుపుకోవాలి .

అంతే  వెరైటీ  కొత్తిమీర   కారం  సిద్ధం. 

ఈ  కొత్తిమీర  కారం  ఇడ్లీ , దోశెలు మరియు  భోజనము లోకి  చాలా  బాగుంటుంది . వేడి వేడి  అన్నంలో  మూడు స్పూన్లు  నెయ్యి వేసుకుని  తింటే  ఆ రుచి  అద్భుతంగా  ఉంటుంది .

ధనియాలు  కొత్తిమీర  రెండూ  ఆరోగ్యానికి  చాలా మంచివి .

ఈ  కొత్తిమీర  కారం  పచ్చడి రోటి సౌకర్యం  ఉన్నవాళ్ళందరూ  రోటిలోనే  చేసుకుంటే  అద్భుతమైన  రుచిగా  ఉంటుంది .

రోటి  సౌకర్యం  లేని వారు  ఇదే  పద్ధతిలో  మిక్సీలో  చేసుకొనవచ్చును .

Comments