నిమ్మకాయకారం ( పాత తరం పద్థతిలో )



నిమ్మకాయ  కారం .  (  పాత తరం పద్థతిలో )
*************************************

ప్రియమిత్రులందరికీ 

ఈ  రోజున  మీ  అందరికీ   నోట్లో  నీరు  ఊరించే  నిమ్మకాయ  కారం గురించి తెలియ చేస్తాను .

ఈ  నిమ్మకాయ  కారం  చేయడానికి  కావలసిన  పదార్ధములు .

పసుపు  రంగు  వచ్చిన  నిమ్మకాయలు  -   నాలుగు
ఎండు మిర్చి   ---   15
నూనె  --  మూడు  స్పూన్లు 
పసుపు  --  పావు స్పూనులో సగం
ఉప్పు   ---  తగినంత 

పోపుకు  కావలసినవి .

పొట్టు మినపప్పు   అయితే  మంచిది .
లేకపోతే  చాయమినపప్పు   వాడండి.

మినపప్పు  ---  మూడు స్పూన్లు 
ఆవాలు  --  ఒక  స్పూను 
మెంతులు  --  ఒకటిన్నర  స్పూను 
ఇంగువ  --  తగినంత  (  కాస్త ఎక్కువ  )

ఈ  నిమ్మకాయ కారం  మిక్సీలో  కంటే  రోట్లో పచ్చడి బండతో  నూరుకుంటే  తినేటప్పుడు  పప్పులు  తగులుతూ  చాలా   రుచిగా  ఉంటుంది.

రోట్లో నూరుకునే  అవకాశం  లేని  వారు  మిక్సీలో   మరీ  మెత్తగా  కాకుండా కొంచెం  పప్పులు  తగిలేటట్లు  వేసుకుంటే  బాగుంటుంది.

నిమ్మ కాయల  కారం  తయారీ  విధానము .

ముందుగా  నాలుగు  నిమ్మకాయలు  చేదు  దిగకుండా  రసం  తీసుకొని  వేరే  చిన్న గిన్నె లోకి  తీసుకోండి.

ఆ  తర్వాత  స్టౌ  వెలిగించి   బాండి పెట్టి  అందులో  మూడు  స్పూన్లు  నూనె వేసి ముందుగా  మెంతులు  నల్లగా  కాకుండా  పచ్చి వాసన  పోయి  కమ్మని  వాసన  వచ్చే వరకు  వేయించుకుని  అందులో  ఎండు మిర్చి , పొట్టు మినపప్పు , ఆవాలు , మరి కాస్త  ఇంగువ  వేసి  పోపు  మాడకుండా  వేయించుకోవాలి. 

ఇప్పుడు  రోట్లో  కాని  మిక్సీ లో  కాని  ముందుగా  ఎండు మిర్చి , పావు  స్పూన్ పసుపు , సరిపడా  ఉప్పు వేసి పచ్చడి  బండతో  దంచు కోవాలి.  లేదా  మిక్సీ  వేసుకోవాలి.

 ఆ  తర్వాత  మిగిలిన  పొపు  వేసి  మరీ  మెత్తగా   కాకుండా  పప్పులు  తగిలేటట్లుగా  దంపుకోవాలి.

లేదా  మిక్సీ  వేసుకోవాలి.

చివరగా  తీసి  ఉంచుకున్న   నిమ్మరసం  వేసి  నూరు కోవాలి. లేదా  మిక్సీ  వేసుకోవాలి.  

ఆ తర్వాత  ఒక  గిన్నె లోకి  తీసుకోవాలి.

అంతే.  కమ్మని  మెంతులు  మరియు  ఇంగువల  వాసలతో  ఘుమ  ఘుమ  లాడే  నిమ్మకాయల రసం  సర్వింగ్  కు  సిద్ధం.

ఈ  నిమ్మకాయల  రసం  అన్నం  లోకి, వేడి  వేడి  ఇడ్లీల లోకి మరియు  దోశెలలోకి  చాలా  బాగుంటుంది .

పప్పులు  నిమ్మరసం లో  ఊరి  తినడానికి   చాలా చాలా  రుచిగా  ఉండటమే గాక ,  ఫ్రిజ్  లో  ఉంచక పోయినా  వారం   రోజులు  నిల్వ ఉంటుంది.


Comments