కరివేపాకు వెల్లుల్లి పచ్చడి


కరివేపాకు  వెల్లుల్లి  పచ్చడి.

ఈ  కరోనా  కాలంలో  మన శరీరంలో  రోగ నిరోధక  శక్తి  వృద్ధి  చెందడానికి  మధ్య మధ్యలో  వెల్లుల్లి  కూడా  ఆహారంలో  తీసుకోవడం  మంచిది . జీర్ణ శక్తి  కూడా వృద్ధి  చెందుతుంది.

సీజన్  మారినప్పుడు  ఇలా  వెల్లుల్లి  , జీలకర్ర  మరియు కరివేపాకు  వంటివి  తీసుకుంటే దగ్గు , జలుబు  వంటి  అనారోగ్యాలకు  దూరంగా  ఉంచుతుంది.  ప్రస్తుతం  వానాకాలం  నడుస్తోంది.కావున జలుబు దగ్గు  వంటి  అనారోగ్యాలకు దూరంగా ఉండాలంటే  ఈ పచ్చడిని  చేసుకుని  తినండి.
కావలసినవి.

ఎండుమిరపకాయలు  - 12.

కరివేపాకు  -  అర కప్పు.

వెల్లుల్లి  రెబ్బలు -  పై పొట్టు  వలిచినవి   25

చింతపండు  - రెండు రెబ్బలు .

చాయమినపప్పు  / పొట్టు  మినపప్పు   -  రెండు  స్పూన్లు 
జీలకర్ర   -  స్పూను.

ఆవాలు  -   స్పూను.

నూనె  -  మూడు స్పూన్లు .

పసుపు  -  పావు  స్పూను.

ఉప్పు   -  తగినంత .

తయారీ  విధానము .

స్టౌ  మీద  బాండీ  పెట్టి  మూడు  స్పూన్లు  నూనె వేసుకుని , నూనె బాగా కాగగానే  వరుసగా  ఎండుమిరపకాయలు , చాయ / పొట్టు మినపప్పు , జీలకర్ర  , ఆవాలు , వెల్లుల్లి  రేకలు  మరియు  కరివేపాకును  వేసుకుని పోపును  కమ్మని  వాసన  వచ్చే వరకు  వేయించుకోవాలి.

పోపు  చల్లారగానే  ఈ వేయించిన  పోపు , పావు  స్పూను  పసుపు  మరియు తగినంత  ఉప్పు వేసుకుని  మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి.

ఇందులో వేసుకునే  చింతపండు  తడప నవసరం లేదు . పచ్చడిలో  అసలు  నీరు పోయవలసిన  అవసరము లేదు.

ఇది  పచ్చడి /  పొడి కు  మధ్యస్థంగా  ముద్దగా  ఉంటుంది.

వేడి  వేడి  అన్నంలో నెయ్యి వేసుకుని  ఈ పచ్చడి  వేసుకుని  మొదటి  ఐటమ్ గా  తింటే  చాలా రుచిగా  ఉంటుంది.

ఈ పచ్చడిలో  ధనియాలు  వేయనవసరం లేదు.

వెల్లుల్లి  ఇష్టపడని వారు  మాత్రం  వెల్లుల్లి  బదులుగా   పోపులో  స్పూనున్నర   ధనియాలు  వేసుకుని  చేసుకొనవచ్చును .

Comments